మనన్యూస్,కాకినాడ:14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం లోని చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని ఈ సభకు లక్షలాది మంది జనసైనికులు హాజరవుతారని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆయా కమిటీలు పకడ్బందీగా చేస్తున్నాయని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల, కందులలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని దీనికి అధిక సంఖ్యలో హాజరవ్వడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ ప్రాంగణంతో పాటు పలు చోట్ల వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, ఎల్ఈడి స్క్రీన్స్, మరుగు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అధినేత పవన్ అభిమానులు, జనసైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారని మనోహర్, దుర్గేష్‌లు చెప్పారు. ఈ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి సందేశాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 12న వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే యువత పోరుపై వారు స్పందించారు. యువతతో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ఫీజు ఫోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. రాష్ట్రం నాశనం అవ్వడానికి జగన్ వైఖరి కారణమని వారు చెప్పారు. వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వానికి యువత, మహిళలు, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని కందుల, నాదెండ్లలు అన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, పత్సమట్ల ధర్మరాజు స్థానిక నాయకులు తలాటం సత్య, చోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.