Mana News :- ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. అలాంటి వేళ తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు అనుహ్యాంగా తెరపైకి వచ్చింది. ఆమె పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు చెబుతున్నా.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్.. రాములమ్మ పేరును తెరపైకి తీసుకు వచ్చినట్లు ఓ ప్రచారం అయితే ఆ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో బీజేపీపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించిన విషయం విధితమే. ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తిరింది. అయితే.. ఆ నాటి నుంచి మళ్లీ విజయశాంతి ఎక్కడా కనిపించ లేదు. ఆమెను ఏ పదవి వరించలేదు. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఆమె పేరు చాలా అనుహ్యాంగా తెరపైకి రావడం గమనార్హం. తొలుత విజయశాంతి బీజేపీలో అంటే.. 1998లో చేరారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ కోసం 2009లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని అదే ఏడాది టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఆ మరుసటి ఏడాదే అంటే.. 2010లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ కొద్ది రోజులకే మళ్లీ మనస్సు మార్చుకొని టీఆర్ఎస్ పార్టీలోకి పున ప్రవేశం చేశారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకరమవుతోన్న వేళ.. మరోవైపు అసెంబ్లీతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ.. టీఆర్ఎస్ నుంచి దూరం జరిగి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2020లో మళ్లీ విజయశాంతి బీజేపీలో చేరారు. ఇక 2023లో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ ఎంపీగా ఆమె విజయం సాధించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను తనకు దేవుడిచ్చిన సోదరుడంటూ ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆ పార్టీని వీడారు.అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవుతోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఆ పార్టీ అధిష్టానంతో విజయశాంతి సన్నిహితంగా మసలుతోన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే కేసీఆర్.. ఆమెను దూరం పెట్టారనే ఓ ప్రచారం సైతం సాగింది.ఏదీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత విజయశాంతి శాసన మండలిలో అడుగు పెట్టే అవకాశం లభించడం ద్వారా జాక్ పాట్ కొట్టిందనే ఓ చర్చ సైతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.