Mana News :- నటుడు పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ పై పోసానిని కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చిన భవానీపురం పోలీసులు నేడు ఛీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. జనసేన నేత శంకర్ ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. ఇవాళ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా, పోసాని న్యాయమూర్తి ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. ఇంచుమించు ఒకే అంశంపై కేసులు పెట్టి అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని పేర్కొన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని న్యాయమూర్తికి వివరించారు. కాగా, రిమాండ్ విధించిన నేపథ్యంలో, పోసానిని మళ్లీ కర్నూలు జిల్లా జైలుకు తరలించనున్నారు.