మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:పాల్వంచ మండలం పాత పాల్వంచ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలను ఆకస్మికంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించి,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.విద్యార్థులతో భోజనం చేస్తూ కలెక్టర్ వారితో మమేకమై వారి బాగోగులను,భోజనం పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడగాలని ఆయన సూచించారు. ఆహారాన్ని వదిలివేయరాదని,చక్కని ఆరోగ్యానికి ఆహారం సహకరిస్తుందని ఆయన చెప్పారు.పౌష్టిక ఆహారం పట్ల అవగాహన పెంచుకోవాలని,పౌష్టికాహారాన్ని ముఖ్యంగా బాలికలు విధిగా తీసుకోవాలని కలెక్టర్ బోధించారు. ఆహార పదార్థాలను వృధా చేయరాదని సూచించారు.విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని కోరారు.ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను బాగా గ్రహించాలని అందుకు ఏకాగ్రత అవసరమని కలెక్టర్ అన్నారు.పాఠ్యాంశాలలో సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు.అనంతరం అధికారులతో మాట్లాడుతూ వంట వండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,పాత్రలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని సూచించారు.మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపారు.చిన్నారులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పాఠశాలకు మంజూరైన స్పోర్ట్స్ మెటీరియల్ కిట్లను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలను సరళతరం చేసేందుకు, అనుకూలంగా భోజనం చేసేందుకు వీలుగా కిచెన్ సెట్,ఐరన్ పొయ్యి ఏర్పాటు,బల్లలు, బెంచీలు,విద్యార్థులకు ప్రత్యేకంగా లంచ్ బాక్స్ తో కూడిన బ్యాగ్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి,నివేదికలు అందించాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,జిల్లా కోఆర్డినేటర్ సైదులు,సతీష్ కుమార్,ఎంఈఓ రామ్మూర్తి, ప్రధానోపాధ్యాయురాలు పద్మలత,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.