Mana News, Internet Desk :- బీజింగ్ : బెదిరింపులకు భయపడబోమని, అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అధిక టారిఫ్లు, ఇతర సవాళ్లను ఎదుర్కొనగలిగే సామర్ధ్యం తమ ఆర్థిక వ్యవస్థకు వుందని చైనా వాణిజ్య శాఖ మంత్రి వాంగ్ వెంటావో స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధంలో విజేతలు అంటూ ఎవరూ వుండరని వ్యాఖ్యానించారు. చైనా నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశం సందర్భంగా వాంగ్ మాట్లాడుతూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిపేందుకు చైనా సిద్ధంగా వుందని పునరుద్ఘాటించారు. బెదిరింపులు, బలవంతపు చర్యలు అంతిమంగా విఫలమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
చైనాపై ఇలాంటివి పనిచేయవని అన్నారు. తమను భయపెట్టలేరన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలన్న చైనా కృతనిశ్చయం తిరుగులేనిదన్నారు. 140 దేశాలకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా చైనా వుందంటే తమకు అనేక అవకాశాలు వున్నాయని అర్థమని అన్నారు. తమ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మార్కెట్ల నిర్మాణానికి, బలోపేతానికి అనుసరించే వ్యూహాల గురించి ఆయన వివరించారు. జనవరి నుండి రెండుసార్లు చైనాపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లు పెంచింది. చైనా కూడా ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై, కంపెనీలపై ఇలాంటి ఆంక్షలు విధించింది. ఇతర దేశాలతో వ్యవహారాల్లో పరస్పర గౌరవం వుండాలని చైనా ఆకాంక్షిస్తుందన్నారు., అమెరికా ఈ తప్పుడు దారిలోనే ముందుకు సాగితే తాము కూడా అదే రీతిన ప్రతిస్పందిస్తామని, చివరికంటా పోరాడతామని చెప్పారు. వాణిజ్యంపై విభేదాలుంటే పరిష్కరించుకోవడానికి చైనా సిద్ధంగా వుందన్నారు. సాధ్యమైనంత త్వరలో సముచితమైన సమయంలో ఉభయ పక్షాలు సమావేశమై సమాచార మార్పిడి చేసుకోవాలన్నారు.