మనన్యూస్,గొల్లప్రోలు:ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష అనుమతులు కావాలని తమ కార్యాలయం చుట్టూ తిప్పుకునే అధికారులు బడా బాబులు యదేచ్ఛగా అక్రమంగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నా అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.గొల్లప్రోలు పట్టణ శివారు జాతీయ రహదారి పక్కన,గొల్లప్రోలు తాడిపర్తి పొంత రోడ్డు లోనూ లేఅవుట్లు ఏర్పాటు చేసినా అధికారి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.అనుమతులులేని లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నగర పంచాయతీ సమావేశాలలో పలుమార్లు సభ్యుల అధికారం డిమాండ్ చేసినప్పటికీ అధికారులు ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయడం లేదు.పట్టణ శివారు జాతీయ రహదారి పక్కనే ఎటువంటి అనుమతులు లేకుండా రాజకీయ పలుకుబడి ఉపయోగించి బహిరంగంగా పంట పొలాలను గ్రావెల్ తో పూడ్చి లేఅవుట్లుగా మారుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, అనుమతులు లేకుండా గ్రావెల్ లారీలు రాత్రి పగలు అనే తేడా లేకుండా తిరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.తాడిపర్తి పొంత రోడ్లో జనసేన నాయకుడిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తి ఇరిగేషన్ కాలువైన సైతం ఆక్రమించే విధంగా పంట పొలాన్ని పూడ్చి వేసినా ఇరిగేషన్,రెవెన్యూ చోర్యం చూస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గొల్లప్రోలు పట్టణ,మండల పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.