Mana News :- మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ హయాంలో అవినీతి.. అక్రమాలకు పాల్పడిన వారి పైన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరి పైన వరుసగా ఫోకస్ చేస్తోంది. వైసీపీ నేతలు వరుసగా జైళ్లకు వెళ్తున్నారు. ఇక, మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజనీ ఒక స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రజనీ పైన విచారణ కోసం ఏసీబీ తాజాగా గవర్నర్ కు లేఖ రాసింది. ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి జాషువా విచారణకు సీఎస్ అనుమతి లభించింది. చిక్కుల్లో రజనీ :- మాజీ మంత్రి విడదల రజనీ పైన ఏసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్ కు లేఖ రాసింది. మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజనీ,ఐపీఎస్ అధికారి జాషువాతో కలిసి తమను బెదిరించారంటూ స్టోన్ క్రషర్ యజమానులు ఫిర్యాదు చేసారు. ఈ కేసులో ఈ ఇద్దరి విచారణకు ఏసీబీ పట్టుదలగా ఉంది. యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇందులో జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. ఇప్పుడు విడదల రజనీ విచారణకు అనుమతించాలని ఏపీ గవర్నర్ కు లేఖ రాసింది. గవర్నర్ అనుమతి కోసం :- ప్రభుత్వం తాజాగా గవర్నర్ కు రాసిన లేఖ పైన ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమోదం రాగానే వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ఈ ఆరోపణల పైన ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విడదల రజనీ, ఐపీఎస్ జాషువాలు రూ.5కోట్లు డిమాండు చేసి.. రూ.2.20 కోట్లు వసూలు చేశారని.. అందులో రజినికి రూ.2 కోట్లు, జాషువాకు రూ.10 లక్షలు, రజిని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.