మన న్యూస్,నిజాంసాగర్:- జుక్కల్,యాసంగి సీజన్ లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న ప్రతి గుంటకూ పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్ మధుసూదన్ తో కలిసి ఆయన శనివారం నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల తీరును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలను పరిశీలించారు. అనంతరం గుల్గోస్తా వద్ద నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మాట్లాడుతూ.. మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు ఆయకట్టు కింద సాగవుతున్న పంటలు చేతికి అందేంతవరకు అధికారులు మరింత కష్టపడి పని చేయాలని సాగునీటిని అవసరాల మేరకే వినియోగించుకునేలా ఇటు అధికారులు అటు రైతులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.సాగు నీరు వృధా కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ నీటి విడుదల కొనసాగించాలని సూచించారు.ఆయకట్టు అవసరాల మేరకు తూముల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీలకు గాను 1397.98 అడుగులు 9.311 టీఎంసీల నీరు నిల్వ ఉందని అన్నారు. ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో నిజామాబాద్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి,ఉమ్మడి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దుర్గి శ్రీనివాస్,పీసీసీ జనరల్ సెక్రెటరీ నగేష్ రెడ్డి,ఈఈ సోలోమన్, ఏఈఈలు శివ ప్రసాద్,సాకేత్ లు తదితరులు ఉన్నారు.