"వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం."
"ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో భయాందోళనలు రేపింది, కూటమి ప్రభుత్వం భూమి యజమానులకు భద్రత కల్పించింది."
"భూమి సమస్యల పరిష్కారానికి దేశంలోనే తొలిసారి రెవెన్యూ సదస్సులు నిర్వహించింది కూటమి ప్రభుత్వమే.."
"రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ, ఆర్థిక స్థిరత్వాన్ని తెచ్చినది కూటమి ప్రభుత్వం."
"వైసీపి అవినీతికి నాడు - నేడు మారుపేరు, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో విద్యా సంస్కరణలు తెస్తుంది."
"గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.."
మనన్యూస్,పూతలపట్టు:గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలు మాత్రమే అని, వైసీపి విధ్వసం పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజు "పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ " తన గళాన్ని వినిపించారు. గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటుచేసుకున్న విధ్వంసం నుంచి రాష్ట్రం ముందుకు సాగుతున్న తరుణంలో, కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలో సాధించిన విజయాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించడం గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో భయాందోళనలకు దారి తీసిందని, భూమి యజమానులు తమ ఆస్తుల భద్రత కోసం నిరంతరం భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి, భూ యజమానులకు భద్రత కల్పించిందని ఆయన స్పష్టం చేశారు. భూమి సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని, 2024 డిసెంబర్ 6 నుంచి 2025 జనవరి 8 వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు. ఈ సదస్సుల ద్వారా 17,400 గ్రామాల్లో ప్రజల భూసంబంధ సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టారని చెప్పారు. గత ప్రభుత్వం అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచిందని, దాదాపు రూ. 1,40,000 కోట్ల మేర బకాయిలు మిగిల్చిందని ఆయన ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ఆర్థిక విధానాలను రూపొందించిందని, పెన్షన్ పెంపు, వికలాంగులకు సాయం, గ్యాస్ కనెక్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.పేదవాడు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో 203 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, దీపం-2 పథకం కింద 90 లక్షల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. రాబోయే ఉగాదికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా అందించనున్నట్లు తన సమావేశాల్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, నాడు-నేడు పథకం కేవలం అవినీతి మార్గంగా మారిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం నూతన విధానాలతో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, 117 జీవో వల్ల విద్యా రంగం నాశనమైనప్పటికీ, దాన్ని సవరించి భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రజలకు హక్కుగా ఉండే ఇళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకున్నదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని, గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు భూమి పంపిణీకి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా స్పష్టమైందని మురళీమోహన్ అన్నారు. అసెంబ్లీలో అరుపులు, కేకలు పెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరమని, ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలు విఫలమవుతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి రానున్నాయని మురళీమోహన్ గారు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు ధన్యవాదాలు తెలియజేశారు.