మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు :
మాజీమంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ రాజు మంగళవారం చలో తుని కార్యక్రమంకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో బయలుదేరుగా స్థానిక పోలీసులు ధర్మవరం మెయిన్ రోడ్డుమీద అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసులు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ లక్ష్మీకాంత వైసిపి నాయకులు మురళి రాజు తుని వెళ్తే 144 సెక్షన్ అమల్లో ఉందని అరెస్టు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం మురళి రాజు భారీ వైసిపి శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు మద్దతుగా తుని బయలుదేరి వెళ్లారు. అలాగే గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబును, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత బాబు, రామచంద్రపురం నియోజవర్గం ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్, ముదునూరి మురళి రాజులు తుని బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మురళి రాజు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టిడిపికి మెజారిటీ లేకపోయినా వైసిపి కౌన్సిలర్లు లాక్కోవడానికి చేసే ప్రయత్నం చాలా దారుణం అన్నారు. ఈ ప్రయత్నాన్ని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి సమర్థవంతంగా అడ్డుకున్నారన్నారు. దీంతో చేసేదిలేక కుటమి ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయించిందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించారు.