మనన్యూస్,గొల్లప్రోలు:చెందుర్తి గ్రామ సర్వేనెంబర్1లో వున్న భూముల్లో గత 40 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న ఎస్సీ,బీసీ పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అనగా 10.2 2025న సర్వే నెంబర్ 1 లో ఉన్న సాగుదారులందరు కలసి చెందుర్తి గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాగుదారులు మాట్లాడుతూ కాకినాడ జిల్లా,పిఠాపురం నియోజకవర్గం చెందుర్తి గ్రామ సర్వేనెంబర్1లో ఉన్న 456 ఎకరాల ప్రభుత్వ భూములలో గత 40 సంవత్సరాల నుండి చెందుర్తి,కొడవలి, కొత్త వజ్రకూటం గ్రామాలకు చెందిన ఎస్సీ,బీసీ కులాల పేదలు సాగు చేస్తూ వారి జీవనం సాగిస్తున్నారన్నారు.సాగుదారులైన పేదలకు పట్టాలు మంజూరు చేయాలని మండల స్థాయి నుండి జిల్లా స్థాయిలో అధికారుల వరకు అనేకసార్లు విన్నవించగా ఫలితంగా అప్పటి జాయింట్ కలెక్టర్ గా ఉన్న గోపాలకృష్ణ దివేది సుమారు నెల రోజులపాటు 15 మంది సర్వే బృందంతో సర్వే చేయించి సాగుదారులను గుర్తించడం జరిగిందని అన్నారు.అప్పటినుంచి ఇప్పటివరకు అధికారులకి పట్టాల కోసం మొరపెట్టుకున్న ఫలితం లేదు సరిగదా ప్రభుత్వ యంత్రాంగం,స్థానిక ప్రజాప్రతినిధులు ఈ భూములపై కన్నుపడి,బడా కంపెనీలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్యని విమర్శించారు.ఈ విధానాన్ని నిరసిస్తూ స్థానిక సాగుదారులందరూ కలసి గౌరవ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా సాగుదారులకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిందని అన్నారు.ఈ స్టే ఇప్పటికీ కొనసాగుతుందని అన్నారు.అయినా కొంతమంది ఈ భూములను స్వాహా చేయడానికి పై స్థాయిలోనే పావులు కదపడం జరుగుతుందని తక్షణం ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని,లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి గత 40 సంవత్సరాలు నుండి సాగులో ఉన్న చెందుర్తి,కొడవలి,కొత్త వజ్రకూటం ఎస్.సి,బి.సి కులాల సాగుదారులకు హక్కులు కల్పించి,పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం పై డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక సచివాలయం గ్రామ రెవెన్యూ అధికారి గారికి అందజేయడం జరిగింది.
స్థానిక రామాలయం నుండి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ గ్రామ సచివాలయం వరకు వెళ్ళటం జరిగింది.ఈ కార్యక్రమంలో సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ లిబరేషన్ రాష్ట్ర కమిటి సభ్యులు గొడుగు సత్యనారాయణ, కాకర రత్నకుమారి,అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మానుకొండ లచ్చబాబు,మహిళా సంఘం (ఐప్వా) జిల్లా నాయకురాలు జి.నాగమణి,నక్కా మంగమ్మ, లక్ష్మి, స్థానిక సాగుదారులు తంగెళ్ళ రాంబాబు, కన్నాటి వెంకటరమణ మహాలక్ష్మి, నక్కా అప్పన్న, శ్రీను,కె.గంగరాజు అప్పారావు, సత్తిబాబు తదితరులు నాయకత్వం వహించగా వందలాదిమంది మహిళలు,యువకులు పాల్గొన్నారు.