వెదురుకుప్పం మన న్యూస్:- జానపద కళాకారుడు, పండరి భజన, చెక్కభజన,కోలాటం గురువు ఎన్.రామకృష్ణా రెడ్డి కళా సేవ చిరస్మరణీయమని దూరదర్శన్ పూర్వ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఓలేటి పార్వతీశం కొనియాడారు. వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు, జానపద గురువుగా ప్రసిద్ధుడైన ఎన్ రామకృష్ణారెడ్డికి హార్దిక సన్మాన కార్యక్రమం జరిగింది. సుమారు 20 కి పైగా కళాబృందాలను తయారుచేసి అనేక ప్రాంతాలలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలలో కూడా వీరి కళాబృందాలు పాల్గొంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, లలిత కళాభిరామ పింఛము సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్ర భారతిలోని మినీ ఆడిటోరియంలో జరిగిన 20వ వార్షిక పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. ఈ సంస్థలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కళకు సేవ చేసిన కళాకారులని గుర్తించి ప్రతి సంవత్సరం పురస్కార ప్రదానోత్సవం హార్దిక సన్మానం చేస్తాయి. ఈ సంవత్సరం చిత్తూరు జల్లా నుండి రామకృష్ణా రెడ్డికి ఆ అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కడప జిల్లా అధ్యక్షులు ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ,కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ జి పి డి క్రిష్టీ తదితరులు రామకృష్ణారెడ్డి సేవలను కొనియాడారు.