మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు శివారు జగన్ కాలనీ వద్ద సుద్ద గడ్డ కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఎగువ ప్రాంతంలోని భూములకు సాగునీరు నిలిచిపోనున్న నేపథ్యంలో నీరు ఎలా అందించాలన్న అంశంపై బుధవారం గొల్లప్రోలు తహసీల్దార్ సత్యనారాయణ,ఆర్ అండ్ బి డి ఇ నరసయ్య తర్జనబర్జన పడ్డారు.జగన్ కాలనీ బ్రిడ్జి మార్చి నెలాఖరులోపు పూర్తిచేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశించడంతో పనులు ముమ్మరం చేసారు.ప్రస్తుతం కాలువ నీరు ప్రవహిస్తున్నందువల్ల పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతోంది.దీంతో కాలువకు అడ్డుకట్ట వేసి ఒక తూర మాత్రమే ఏర్పాటు చేశారు.దీంతో కాలువలో నీటి ప్రవాహం నిలిచిపోయి పంటకు నీరు అందని పరిస్థితి నెలకొంది.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే సుమారు 500 ఎకరాల్లో సుద్దగడ్డ,పిబిసి ఎగబోటు నీటిని ఆధారంగా చేసుకుని వరి,కాయగూరలు,అపరాల పంటలు సాగు చేస్తున్నారు.వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టిన సమయంలో అర్ధాంతరంగా నీరు నిలిపిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.దీంతో ఆర్ అండ్ బి డిఇ నరసయ్య,తహసీల్దార్ సత్యనారాయణ,కాంట్రాక్టర్ సుబ్బరాజుతో కలిసి బ్రిడ్జి నిర్మాణ పనులను,సుద్దగడ్డ కాలువను పరిశీలించారు.బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పంటలకు ఏ విధంగా సాగునీరు అందించాలని అంశంపై చర్చించారు.కాలువలో అడ్డుకట్ట వేయడం వల్ల పి బి సి నుండి వచ్చే ఎగబోటు నీరు నిలిచిపోతుందని అందువల్ల నీరు క్రిందకు ప్రవహించేందుకు వీలుగా రెండు తూరలు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రాయవరం చెరువు నుండి దిగువకు నీరు విడుదల చేయాలని రైతు,జనసేన నాయకుడు అన్నం దేవర పట్టాభి సూచించారు.కాగా రాయవరం చెరువు నుండి నీరు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలపై తహసీల్దార్ సత్యనారాయణ ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.కాలువలో అడ్డుకట్టపై ఆందోళన చెందుతున్న రైతులు బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం సుద్ద గడ్డ కాలువలో అడ్డుకట్ట వేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.పంటలు ప్రాథమిక దశలో ఉన్నాయని ఇప్పుడు అర్ధాంతరంగా నీరు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వేలాది రూపాయలు అప్పుచేసి పెట్టుబడిగా పెట్టామని ప్రారంభ దశలోనే నీటికి ఆటంకం కలిగితే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముందుగా చెప్తే పంటలు వేయకపోదుమని వాపోతున్నారు.అధికారులు తమ పరిస్థితిని గ్రహించి సాగునీటికి ఆటంకం లేకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.