మన న్యూస్,గొల్లప్రోలు: గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు శనివారం సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా,ఉల్లాసంగా జరుపుకున్నారు.పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాశాలను అలంకరించారు. కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,కరస్పాండెంట్, సెక్రటరీ బుర్రా అనురాధ భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు.భోగి మంట చుట్టూ విద్యార్థులు నృత్యం చేస్తూ సందడి చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ బుర్రా అనుబాబు మాట్లాడుతూ భోగి,సంక్రాంతి,కనుమ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇప్పటితరం పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.కళాశాలలో అన్ని వేడుకలు జరుపుకోవడం ద్వారా విద్యార్థులకు ఆయా పండగల ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నామని,అన్ని మతాల వారి పండుగలు ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు నిర్వహిస్తామని తెలిపారు.కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూర్ణకుంభం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.వేడుకల్లో డూడూ బసవన్నలు,కొమ్మ దాసులు,హరిదాసులు సందడి చేశారు.అనంతరం కళాశాల విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాల మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి నగదు,బహుమతులు అందజేశారు.విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సంబరాల్లో ఆటపాటలతో అందరినీ అలరించారు. అనంతరం కళాశాలలో విద్యను అభ్యసించిన ఓల్డ్ స్టూడెంట్స్ కు అల్యుమిని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు కళాశాల చదివిన నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల గురించి చర్చించుకున్నారు.అనంతరం ఆటపాటలతో సందడి చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.ఈ కార్యక్రమాల్లో కళాశాల బీటెక్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శ్రీనివాసరావు,డిప్లొమా ప్రిన్సిపల్ డాక్టర్ వైవిఎన్ రాజశేఖర్, అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.