
మన ధ్యాస, మక్తల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ఐ రాజు విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, రాజ్యాంగ రూపకల్పన, పౌరుల ప్రాథమిక హక్కులు, విధులు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు, రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించి పాటించాలని సూచించారు.అదేవిధంగా యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలు, కుటుంబాలు మరియు సమాజంపై కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే రాజ్యాంగ విలువలను అలవర్చుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్ఐ రాజు పిలుపునిచ్చారు.