
నెల్లూరు, మన ధ్యాస, నవంబర్ 22 : టౌన్ ప్లానింగ్ రంగంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేస్తేనే రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భారతదేశంలో తొలిసారిగా ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, ప్రస్తుతం తెస్తున్న 2.0 అప్‌గ్రేడ్‌తో అన్ని శాఖల అనుసంధానం 3 నుంచి 6 నెలల్లో పూర్తవుతుందని ప్రకటించారు. నెల్లూరు, దర్గా మిట్ట బియం కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్సుడ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునేందుకు కావలిలో 100 శాతం ఇళ్ల వెరిఫికేషన్, నెల్లూరులో లేఅవుట్లు, తెనాలి సహా పలు పట్టణాల్లో పరిశీలించి ఈ రిఫార్మ్స్ చేపట్టామని తెలిపారు. పరిశ్రమలు రావాలన్నా కనీస మౌలిక సదుపాయాలు, ఇళ్లు తప్పనిసరని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, రియల్ ఎస్టేటర్లు, లైసెన్స్ సర్వేయర్లు, ఇంజినీర్లతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు, విజయవాడ, నెల్లూరు ద్వారా దశలవారీగా అమలు చేసిన ఆన్లైన్ విధానాన్ని నేడు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ప్రస్తుతం ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, వక్ఫ్ బోర్డ్, ఎయిర్పోర్ట్, సీకోస్ట్ అథారిటీల సాఫ్ట్వేర్లను అనుసంధానించే ప్రక్రియ వేగంగా జరుగుతోందని వివరించారు. చివరగా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా సెక్రటేరియట్లో నో అపాయింట్మెంట్తో నేరుగా కలవవచ్చని, తప్పకుండా చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు..ఈ కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి విజేత రూప్ కుమార్ యాదవ్,రాష్ట్ర స్థాయి నుండి డబల్యూ ఏ ఎల్ టి పి ఏపీ అధ్యక్షుడు ఎం. ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. హిదయతుల్లా, సంయుక్త కార్యదర్శి ఎన్. మల్లికార్జున రెడ్డి, కోశాధికారి సి.హెచ్. శ్రీనివాస్ కుమార్, మరియు రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు పి.వి.ఎన్. మాణిక్యాల రావు హాజరయ్యారు. వీరితో పాటు నెల్లూరు అసోసియేషన్ నుండి ప్రధాన కార్యదర్శి కె. రవి కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్.కె. అల్తాఫ్, సంయుక్త కార్యదర్శి ఇంతియాజ్ బాబు, కోశాధికారి ఎ. వెంకటేష్, మరియు ఈసీ సభ్యుడు టి.పి. చిట్టి బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.