
మన ధ్యాస,మక్తల్ : కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యమని వడ్వాట్ గ్రామ సర్పంచ్ జి .రవీందర్ తెలిపారు. శుక్రవారం మాగనూరు మండల పరిధిలోని వడ్వాట్ గ్రామ రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల నమోదు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం రేషన్ కార్డు కలిగిన కుటుంబాల వివరాలతో నమోదు ప్రక్రియ ప్రారంభించామని, రేషన్ కార్డు నంబరు చెబితే సరిపోతుందని, జిరాక్స్ పత్రాలు అవసరం లేదని సర్పంచ్ వివరించారు. రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకు తదుపరి దశలో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ నమోదు కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు.బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, రైతు బీమా, నేతన్న చేయూత, గీత, మత్స్యకారుల సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.దరఖాస్తుల్లో కుటుంబ సభ్యులు, ఆధార్, నామినీ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పథకంపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించి అర్హులందరూ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో , నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్, ఎంపీడీవో శ్రీనివాసులు , గ్రామపంచాయతీ కార్యదర్శి రవి , వార్డు మెంబర్లు మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.