
మన ధ్యాస,మక్తల్: యూనియన్ బ్యాంక్ స్థాపించి 108 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం మక్తల్ యూనియన్ బ్యాంక్ శాఖలో మేనేజర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బ్యాంకు ఖాతాదారులు, రైతులు, మహిళలకు సిబ్బంది స్వీట్లు పంచిపెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా మేనేజర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ, తమ బ్యాంకు ద్వారా మహిళలకు చేయూత రుణాలు, రైతులకు సకాలంలో పంట రుణాలు, అలాగే విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సేవలను ఖాతాదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహిళా సిబ్బంది బ్యాంకు ముందు కల్లాపి చల్లి సుందరమైన ముగ్గులు వేశారు. అలాగే రంగురంగుల బెలూన్లు, తోరణాలతో బ్యాంకును సర్వాంగ సుందరంగా అలంకరించి ముస్తాబు చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ బసవరాజ్ అకౌంటెంట్, ఆదికేశవులు, గోల్డ్ లోన్ సిబ్బంది, మహిళా ఉద్యోగులు స్వాతి, స్నేహ, పాషా, సబ్ స్టాఫ్ అనిల్, నర్సింహ, బ్యాంక్ మిత్ర కార్తీక్, రాములుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు మహిళలు ఖాతాదారులు పాల్గొన్నారు.