
బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబర్ 7
రిపోర్టర్ :కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తిమ్మోజిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం రోడ్డుపై పడి ఉండటాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. వెంటనే బంగారుపాళ్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.రెండు రోజుల పాటు మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో, బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బంగారుపాళ్యం ముస్లిం జేఏసీ సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. పోలీసుల సహకారంతో తగ్గువారిపల్లి శ్మశానవాటికలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లు వినాయకం, రెడ్డప్ప, కానిస్టేబుల్ యూనిస్ పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిగాయి. ముస్లిం జేఏసీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ అహ్మద్ (అన్ను), రియాజ్, సల్మాన్, బాషా, అంబులెన్స్ రాజా, జీలాన్, తగ్గువారిపల్లి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం జేఏసీ సభ్యులను స్థానికులు అభినందించారు.