
గ్రామాల ప్రగతి కోసం ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఉదయగిరి శాసనసభ్యుల పిలుపు.. ప్రజాక్షేత్రంలో విశేష స్పందన!
కలిగిరి అక్టోబర్ 31 మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కలిగిరి మండలంలో బుల్లెట్ వేగంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని గంగిరెడ్డిపాలెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాలెం, చిన్న అన్నలూరు సెగ్మెంట్లలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. కూటమి మద్దతుదారులు, అభ్యర్థుల తరఫున ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ 'సైకిల్' గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామగ్రామానా ఎమ్మెల్యే సురేష్‌కు ప్రజలు, మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు.
కూటమి పాలనలోనే గ్రామాల వికాసం:ప్రచార సభల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అండతో కూటమి ప్రభుత్వం అద్భుత పాలన అందిస్తోందన్నారు. ప్రజా సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల కల్పనే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో పల్లెలు మరింత ప్రగతి పథంలో పయనించాలంటే స్థానిక సంస్థల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం చారిత్రక అవసరమని ఆయన స్పష్టం చేశారు.
సైకిల్ గుర్తుకే మన ఓటు:కలిగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి మెట్టుకూరు శిరీష రెడ్డితో పాటు గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి పోలు ఆది లక్ష్మమ్మ, తెల్లపాడు అభ్యర్థి శ్రీ బిజ్జం కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డిపాలెం అభ్యర్థి శ్రీమతి తోకల యమున, చిన్న అన్నలూరు అభ్యర్థి శ్రీ ఏలూరి మహేంద్రలను సైకిల్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను చేతులు జోడించి వేడుకున్నారు.
సమస్యల పరిష్కారానికి నాదే హామీ:పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లోని స్థానికులతో నేరుగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లెల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి, అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువలు, పారిశుధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో అత్యంత వేగంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన శ్వాస అని ప్రకటించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు విభేదాలు వీడి, సమన్వయంతో ప్రతి ఇంటికీ వెళ్లి అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతు చూస్తుంటే కలిగిరిలో కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఎమ్మెల్యే సురేష్ ధీమా వ్యక్తం చేశారు.


