
కలిగిరి బిట్–2లో పాలూరు కొండారెడ్డి ప్రచార హోరు.. గ్రామ గ్రామాన ప్రజలతో మమేకం!
కలిగిరి అక్టోబర్ 29 మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలిగిరి మండలం బిట్–2 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి, మండల ప్రజా పరిషత్ (MPP) అభ్యర్థి పాలూరి కొండారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బిట్–2 పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇందులో భాగంగా మండల కేంద్రమైన కలిగిరిలోని ఎస్టీ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు, స్థానిక అవసరాల గురించి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమవుతూ తనకు మద్దతు తెలపాలని కోరారు.
ఈ సందర్భంగా పాలూరు కొండారెడ్డి మాట్లాడుతూ.. కలిగిరి బిట్–2 ఎంపీటీసీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలతో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు.
ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ స్థానిక సంస్థలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు