కమిషనర్ ఎం.జయకృష్ణ.
మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా ఎస్.వి.ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కమిషనర్ ఎం.జయకృష్ణ అధికారులను ఆదేశించారు. ఎస్.వి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలను బుధవారం అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర నిఘా ఉండేలా చూడాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భద్రత, రిసెప్షన్ ఏర్పాట్లు, ఇతర సౌకర్యాల కల్పనలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు.
కమిషనర్ వెంట అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రిటర్నింగ్ ఆఫీసర్ భరత్, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, డి.ఎస్.పి భక్తవత్సల నాయుడు, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, డి.ఈ. మహేష్, తదితరులు ఉన్నారు.

