
కలిగిరి, అక్టోబర్ 22 మన ధ్యాస ప్రతినిధి - శ్రీకాంత్: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కలిగిరి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జెడ్పీటీసీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలేపాటి జయమ్మ గారు అధికారికంగా నామినేషన్ వేశారు. ఆమె ఎన్నికల బరిలో నిలవడంతో కలిగిరి మండల వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులలో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. నామినేషన్ అనంతరం మాలేపాటి జయమ్మ గారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్ రెడ్డిల ఆశీస్సులతో, అలాగే కలిగిరి మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పాలూరి మాల్యాద్రి రెడ్డిల సంపూర్ణ సహకారంతో తాము ఈ నామినేషన్ వేసినట్టు తెలియజేశారు.
కావలి ముస్తాపురం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాలేపాటి వెంకటసుబ్బయ్య నాయుడు గారి సతీమణిగా జయమ్మ గారికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం ఆమెకున్న అతిపెద్ద బలమని స్థానిక నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలిగిరి మండలాన్ని జిల్లా పరిషత్ స్థాయిలో అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా మండలంలో తాగునీటి సమస్యల పరిష్కారం, అంతర్గత రోడ్ల కల్పన, మహిళా సాధికారత, సంక్షేమం మరియు విద్యార్థుల ఉన్నతి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరియు యువనేత మేకపాటి అభినవ్ రెడ్డిల మార్గదర్శకత్వంలో, పార్టీ బలోపేతానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాదరణ పొందిన మహిళా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మాలేపాటి జయమ్మ గారి విజయం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి కలిగిరి జెడ్పీటీసీ స్థానాన్ని భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని స్థానిక పార్టీ శ్రేణులు అత్యంత ధీమా వ్యక్తం చేశాయి.