
రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఉన్న బీడీ బాలాజీ భవనంలోని 'రేణిగుంట జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్' కార్యాలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షులు (ఎన్ టీవీ) ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి (ఏబీఎన్) భాగ్యరాజ్ మరియు కార్యవర్గ సభ్యులు, యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. రేణిగుంట మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, తిరుపతి ప్రెస్ క్లబ్ నాయకులు మరియు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున అసోసియేషన్ కార్యాలయానికి విచ్చేసారు.
అందరి సమక్షంలో కేకును కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన నాయకులు మరియు పెద్దలు అధ్యక్షులు ప్రవీణ్, సెక్రటరీ భాగ్యరాజ్ నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించి, అసోసియేషన్‌కు ఆశీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రవీణ్ మరియు ప్రధాన కార్యదర్శి భాగ్యరాజ్ మాట్లాడుతూ, "ఎండనకా, వాననకా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా రాత్రింబవళ్లు శ్రమించే జర్నలిస్టుల కష్టం ఎంతో విలువైనది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపుతూ, ప్రజల గొంతుకగా నిలిచే జర్నలిజం ప్రజాస్వామ్యానికి నిజమైన ఊపిరి వంటిది" అని పేర్కొన్నారు.
అనంతరం, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పండుగ వాతావరణంలో విచ్చేసిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు మరియు విలేకరులకు శాలువాలు కప్పి గౌరవించి, మిఠాయిలను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, కార్యవర్గ సభ్యులు మరియు స్థానిక నాయకులు విశేషంగా పాల్గొన్నారు.


