
నిజాంసాగర్, (మన ధ్యాస): ఉమ్మడి నిజాంసాగర్ , మొహమ్మద్నగర్ మండలాల్లో హసన్పల్లి, గాలిపూర్, బంజపల్లి, వెల్గనూర్, గోర్గల్, నర్సింగ్రావుపల్లి, వడ్డేపల్లి తదితర గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గ్రామాలవారీగా మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య

జరుపుకున్నారు.బతుకమ్మ పండుగ కోసం మహిళలు ఉదయాన్నే వివిధ రకాల పూలను సేకరించి, తంగేడు, గునుగు తదితర పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను సాయంత్రం గ్రామ చావిడి వద్దకు తీసుకొచ్చి వరుసగా అమర్చారు. దీంతో ఆయా గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.

అనంతరం మహిళలంతా బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అంటూ చేసిన సందడితో గ్రామ వీధులు మార్మోగాయి. పూలతో అలంకరించిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పూజల అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా సమీప చెరువుల వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

తర్వాత తమ వెంట తెచ్చుకున్న సద్దులను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పంచుకుని ఆనందంగా గడిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్తులు ఐకమత్యంతో జరుపుకోవడం విశేషంగా నిలిచింది. సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళలు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రజా పండరీ, రవీందర్ రెడ్డి, సర్పంచులు బోయిని హరికుమార్ బుజ్జా అంజయ్య,సాతేల్లి పోచయ్య,తదితరులు ఉన్నారు.
