
కలిగిరి, అక్టోబర్ 18, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:
స్థానిక సంస్థల ఎన్నికల సమరం దగ్గరపడుతున్న వేళ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నేడు కలిగిరి మోడల్ స్కూల్ లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.కావలి ఆర్డీవో డి. ఎలీషా బాబు జడ్పీ డిప్యూటీ సీఈవో వై. బ్రహ్మయ్య సంయుక్తంగా మోడల్ స్కూల్ ను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అన్ని వసతులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.పాఠశాలలోని తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ, దివ్యాంగులకు ర్యాంప్ సౌకర్యం, పార్కింగ్ స్థలం వంటి అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఓటర్లు క్యూ లైన్ లో నిలబడే ప్రదేశం, పోలింగ్ సిబ్బందికి కేటాయించే గదులు, బ్యాలెట్ బాక్సులు/ ఈవీఎంల భద్రత వంటి అంశాలపై ఎంఈవో, ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మౌలిక వసతులలో లోటుపాట్లు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆర్డీవో ఎలీషా బాబు, డిప్యూటీ సీఈఓ వై బ్రహ్మయ్య తెలిపారు.ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో), మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
