
వింజమూరు, అక్టోబర్ 17, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:
జలదంకి మండలం అన్నవరం గ్రామంలో వైసీపీకి భారీ షాక్.. 195 కుటుంబాలు టీడీపీ గూటికి.

జలదంకి మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మండలంలో తెలుగుదేశం పార్టీకి భారీ బలం చేకూరగా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ మాజీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి తన ముఖ్య అనుచరులు, నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో* శుక్రవారం జరిగిన భారీ చేరికల కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో మాలకొండారెడ్డితో పాటు అన్నవరం గ్రామానికి చెందిన సుమారు 195 కుటుంబాలు టీడీపీలో చేరాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని అన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో జలదంకి మండలం అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అందుకే ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు.అన్నవరం గ్రామంలో పాలవెల్లి మాలకొండారెడ్డికి ఉన్న పట్టు, ఆయన రాజకీయ అనుభవంతో జలదంకి మండలంలో టీడీపీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ చేరికలతో జలదంకి మండలంలో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనగా, వైసీపీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ కార్యక్రమంలో జలదంకి మండల టీడీపీ అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి, సోమశిల ప్రాజెక్టు ఉపాధ్యక్షులు మధు రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, అప్పల నాయుడు, జై చంద్ర రెడ్డి, ఎగురి రఘు, మహిళలు యువత,తదితర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
