
రేణిగుంట :
రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణంలో 'వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్ మరియు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ప్రతి శనివారం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ... ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కన్నా మిన్నయిన సేవ లేదని, "అన్నదానం మహత్కార్యం" అనే సంకల్పంతో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. శ్రీవారి కృపాదయా కటాక్షాలు తమపై ఉన్నంత వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.
ప్రతి శనివారం సుమారు 500 మందికి పైగా పేదలకు, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి వెళ్లే భక్తులకు భోజనాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ బయట గల ఆవరణలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానిక పేదలు, ప్రయాణికులు విశేషంగా తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సమాజ సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తమ అసోసియేషన్ సభ్యులకు, ఆటో డ్రైవర్లకు, యజమానులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

