
నిజాంసాగర్,( జుక్కల్ ) , (మన ధ్యాస ): నిరుపేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించే దిశగా గాలిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గోరుగంటి కిరణ్ కాలోరి కాశవ్వ, కాలోరి లక్ష్మికి మంజూరు పత్రాలు అందజేసి, ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు భూమిపూజ చేశారు.సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రతను, ఆత్మగౌరవాన్ని అందిస్తుందని సర్పంచ్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సొంత గృహాన్ని నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వ గృహ పథకాలు ఎంతో తోడ్పాటునందిస్తాయని తెలిపారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.గ్రామంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని గోరుగంటి కిరణ్ తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పేద కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు కాలోరి కాశవ్వ, కాలోరి లక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. తమ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశంపై ఆనందం తెలిపారు.ఈ కార్యక్రమంలో: గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రణీత్రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.