: అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. వి . బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎస్వీ మెడికల్ కాలేజ్ వరకు కొనసాగింది. బాలికల భద్రత- మనందరి బాధ్యత, బాలిక చదువు దేశానికి వెలుగు, బాల్యవివాహాలను అరికడదాం- బాలికల భవిష్యత్తును కాపాడుదాం, భ్రూణహత్యలను నివారిద్దాం- స్త్రీ జాతిని నిలబెడదాం అనే నినాదాలతో ఈ ర్యాలీ కొనసాగింది. ఎస్వీ మెడికల్ కాలేజ్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీ అనంతరం డిఎంహెచ్ఓ కార్యాలయ సభా భవనం నందు సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన జరుపుకుంటారని, ప్రతి ఒక్కరూ ఆడబిడ్డల పట్ల వివక్ష చూపకుండా వారి అభ్యున్నతికి పాటుపడాలని వారికి అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని అప్పుడే సమాజం మరియు దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని భ్రూణ హత్యలను నివారించాలని లింగ సమానత్వాన్ని పాటించాలని ఆయన కోరారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు లింగ వివక్షను మానండి ,ఆడపిల్లలను రక్షించండి అనే అంశంతో కూడిన లఘు చిత్ర తయారీ పోటీలను నిర్వహించిందని, ఈ పోటీలలో శ్రీకాళహస్తి ఎస్ వి ఏ మెన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన రేపటి సంతకం అనే టైటిల్ తో కూడిన లఘు చిత్రం మొదటి బహుమతిని, సూళ్లూరుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రూపొందించిన లఘు చిత్రం ద్వితీయ బహుమతిని, నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన లఘు చిత్రం తృతీయ బహుమతిని పొందిందని ఆయన తెలిపారు . పి సి పి ఎన్ డి టి కమిటీ సభ్యులు డాక్టర్ మాధవి మరియు కె.వి రమణ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా కొన్ని ప్రాంతాలలో బాల్యవివాహాలు ద్రోణ హత్యలు జరుగుతున్నాయని వాటి నివారించడానికి క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య ఆరోగ్య సిబ్బంది ఐసిడిఎస్ సిబ్బంది మరియు స్వచ్ఛంద సంస్థల సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ప్రజలకు ఆడపిల్లల ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించాలని కోరారు. లఘు చిత్రాల తయారీలో మొదటి బహుమతి పొందిన వారికి 30 వేల రూపాయలు, రెండవ బహుమతి పొందిన వారికి 20వేల రూపాయలు, మూడవ బహుమతి పొందిన వారికి పదివేల రూపాయలు నగదు బహుమతిని చెక్కుల రూపంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ అందించారు. మరియు లఘు చిత్రీకరణలో పాల్గొన్న వారందరికీ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కార్యాలయ ప్రోగ్రామ్ అధికారులు, సిబ్బంది, పి సి పి ఎన్ డి టి కమిటీ సభ్యులు డాక్టర్ మాధవి( గైనకాలజీ ప్రొఫెసర్), ప్రగతి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కె.వి రమణ ,జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవిశంకర్ వారి సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గుర్రప్ప ,వారి సిబ్బంది, శ్రీకాళహస్తి మెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వాణిశ్రీ ,సూళ్లూరుపేట, నాయుడుపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ మురళి, ప్రసన్న లత, అధ్యాపకులు ,లఘు చిత్ర పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు, పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు సిబ్బంది దితరులు పాల్గొన్నారు.


