
*దుత్తలూరు, అక్టోబర్ 09, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "వన్ మంత్ - వన్ విలేజ్ - ఫోర్ విజిట్స్" కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సచివాలయం పరిధిలో శుక్రవారం ప్రత్యేక గ్రామసభను అధికారులు ఘనంగా నిర్వహించారు.ప్రజలకు రెవెన్యూ సమస్యలు లేని పాలన అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రామాల్లోనే ప్రజల వద్దకు అధికారులు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో దుత్తలూరు మండల సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి శ్రీజ గారు, మండల సర్వేయర్ శివ వీఆర్వో రమణయ్య సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.గ్రామస్థులు తమకున్న పలు రకాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు, ఆన్లైన్లో నమోదు కాని భూములు, ఆదాయ ధృవపత్రాలు, కుల ధృవపత్రాలు మంజూరులో జాప్యం, భూముల సర్వే, హద్దులు, అడంగల్ తదితర అంశాలపై గ్రామస్థులు అర్జీలు సమర్పించారు. ప్రతి అర్జీని అధికారులు స్వీకరించి, పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరి సమస్యను నేరుగా విని, వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. అర్హులైన వారికి వెంటనే ధృవపత్రాలు అందించేందుకు చర్యలు చేపట్టారు.ప్రతి నెలలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు సార్లు మండల స్థాయి అధికారులు సందర్శించడం ద్వారా పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సీనియర్ అసిస్టెంట్ శ్రీజ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తమ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు కి, మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.