పేటమిట్ట, అక్టోబరు 2 – మన ద్యాస
శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 51వ వార్షికోత్సవ వేడుకలు పేటమిట్టలోని మంగళ్ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, సీఏ తదితర కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 263 మంది విద్యార్థులకు దాదాపు రూ.80 లక్షల విలువైన ఉపకార వేతనాలను అందజేశారు.
ట్రస్ట్ అధినేత డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల ప్రతిభకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో విద్యా సహాయం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మరింతమంది పేద విద్యార్థులకు అండగా నిలవాలని సూచించారు.
ట్రస్ట్ అధ్యక్షురాలు డా. గౌరినేని రమాదేవి మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో తమ లక్ష్యాలను వదులుకోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథి డా. పి. కృష్ణయ్య ఐ ఏ ఎస్ (రిటైర్డ్) విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మహదేవ నాయుడు, కార్యవర్గ సభ్యులు, దాతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.