కాణిపాకం, అక్టోబరు 3 – మన ద్యాస
ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గ్రామాలకు కులవివక్షను ప్రతిబింబించే పేర్లను తొలగించి రాజ్యాంగబద్ధమైన పేర్లను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై జనసేన నాయకుడు ఎం. మహేష్ స్వేరో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేష్ స్వేరో తన బృందంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు పూర్తవుతున్నా కొన్ని ప్రాంతాల్లో హరిజనవాడ, గిరిజనవాడ, దళితవాడ, మాలపల్లి, మాదిగపల్లి వంటి పేర్ల వినియోగం కొనసాగడం కులవివక్షకు దారితీస్తోందని అన్నారు. ఇలాంటి పేర్ల స్థానంలో రాజ్యాంగబద్ధమైన, సమానత్వాన్ని ప్రతిబింబించే పేర్లను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ అంశంపై తాము వివిధ సంఘాల నాయకులతో కలిసి సుమారు పదేళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. 2020లో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తను కలిసి వినతిపత్రం అందజేశామని, ఆయన సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటి అమలులో అప్పటి అధికారులు విఫలమయ్యారని తెలిపారు.
తదుపరి ప్రస్తుత జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుకు లిఖితపూర్వకంగా వినతిపత్రాలు అందజేశామని చెప్పారు. సెప్టెంబరు 17న జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిపారు.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, ఎంపీ చొరవతో జిల్లా ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, విశ్వవిద్యాలయాలకు సంబంధిత పేర్లను తొలగించి రాజ్యాంగబద్ధమైన పేర్లను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు మహేష్ స్వేరో తెలిపారు. ఈ నిర్ణయం సామాజిక సమానత్వం దిశగా తీసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు.
జిల్లాలోని ప్రతి రెవెన్యూ అధికారి ఈ ఆదేశాలను త్వరితగతిన అమలు చేసేలా ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు. అంతేకాకుండా జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా అమలయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర నాయకుడు వినోద్ కుమార్ స్వేరో, జనసేన పార్టీ బంగారుపాళ్యం మండల కార్యదర్శి అనిల్ కుమార్, స్వేరోస్ జిల్లా నాయకులు, జనసేన నాయకులు యువరాజ్ స్వేరో, జనసేన యువ నాయకులు కిషోర్ కుమార్, సతీష్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.