
మహారాష్ట్ర నేషనల్ మీట్‌కు కరకంబాడి క్రీడాకారులు ఎంపిక.. రేణిగుంట అక్టోబర్ 1.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామపంచాయతీలోని ‘శ్రీ లక్ష్మీదేవి స్పోర్ట్స్ అకాడమీ’ గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోంది. ఈ అకాడమీని సి. రెడ్డప్ప స్థాపించగా, ఆయన కుమారుడు సి. రెడ్డి కుమార్ (ఫిజికల్ డైరెక్టర్) అకాడమీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు నిరంతరం శిక్షణ అందిస్తున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో (అక్టోబర్ 29 నుండి నవంబర్ 01 వరకు) జరగనున్న జాతీయ స్థాయి జంప్ రోప్ (స్కిప్పింగ్) పోటీలకు అకాడమీకి చెందిన అండర్-12, అండర్-14 విభాగాల్లో పి. చందు, పి. రామ్‌సాయి, కె. మహేష్ బాబు, డి. హిందూమతి, గగన్ దీప ఎంపికయ్యారు.
ఈ అకాడమీలో జంప్ రోప్‌తో పాటు వాలీబాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, ఖో-ఖో, ఫుట్‌బాల్, క్రికెట్, అథ్లెటిక్స్ వంటి క్రీడలలో రోజూ ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. క్రీడలతో పాటు విద్యార్థుల చదువు, మానసిక ఏకాగ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ఈ సందర్భంగా సి. రెడ్డి కుమార్ మాట్లాడుతూ — "నేటి పోటీ ప్రపంచంలో ఆటల వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తాయి. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో శిక్షణ పొందడం భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది" అని పేర్కొన్నారు. జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
