
కలిగిరి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
కలిగిరి మండలంలోని న్యూ ఇన్ఫాంట్ జీసస్ ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థిపై దాడి జరిగిందంటూ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.వివరాల్లోకి వెళితే.. ఏఎస్పేట మండలానికి చెందిన విద్యార్థి కలిగిరిలోని ఇన్ఫాంట్ జీసస్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. పాఠశాలలో విద్యార్థిని హెడ్మాస్టర్ చిరంజీవి కొట్టారని శనివారం విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయగా తమతో వాగ్వాదానికి దిగారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.విద్యను అందించాల్సిన పాఠశాలల్లోనే విద్యార్థులపై ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గతంలోనూ కొండాపురం మండలానికి చెందిన ఓ విద్యార్థి విషయంలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పాఠశాల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు.పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని, వాటిని ప్రైవేట్ యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. శారీరక దండన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకరమని అంటున్నారు.ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు, మండల విద్యాశాఖ అధికారులు స్పందించాలని, పాఠశాలలో జరిగిన వాస్తవ పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధిత తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోపణల్లో వాస్తవముంటే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
