
పూతలపట్టు సెప్టెంబర్ 25 మన ధ్యాస(నాగరాజ సరకింటి)
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే తమ ప్రధాన లక్ష్యమని పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలిపారు. చిత్తూరులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా ప్రజలు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలను ఎమ్మెల్యే మురళీమోహన్ దృష్టికి తీసుకువచ్చి అర్జీలు సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను ఎమ్మెల్యే ఓపికగా విని, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా, నిబంధనల మేరకు సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో పలువురు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
