
కావలి, సెప్టెంబర్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
కావలి మండల విద్యాశాఖాధికారి సూచనల మేరకు బుడమగుంట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బుడమగుంట సచివాలయంలో ఆశా వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి షేక్ హబిబున్నిసా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులందరికీ అల్బెండజోల్ ఐపీ 400 ఎంజి టాబ్లెట్లను పంపిణీ చేశారు. నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు వివరించారు.ఈ సందర్భంగా ఆశా వర్కర్ మాట్లాడుతూ పిల్లలు ప్రతిరోజూ స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలని సూచించారు. భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, మనం పరిశుభ్రంగా ఉంటే మనతో పాటు మన కుటుంబం, మన పాఠశాల, మన సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని పిల్లలకు అవగాహన కల్పించారు.పాఠశాల ఉపాధ్యాయుడు గాదిరెడ్డి మురళీకృష్ణ మాట్లాడుతూ "ఆరోగ్యమే మహాభాగ్యం" అని అన్నారు. విద్యార్థులందరూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. రోజూ రెండు పూటలా వేడినీటితో స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, వారంలో రెండు రోజులు తలస్నానం చేయడం, గోళ్లను నెయిల్ కటర్‌తో పొట్టిగా శుభ్రంగా కత్తిరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
