జీరో డ్రగ్స్.. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్.. జీరో రోడ్ యాక్సిడెంట్స్..
గంజాయిపై ప్రత్యేక నిఘా – అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు…
మహిళలు, బాలికల భద్రతకు జీరో టాలరెన్స్ విధానం…
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ…
ప్రతి గ్రామంలో పోలీసుల పర్యటన – ప్రజలతో ప్రత్యక్ష మమేకం…
ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత, సురక్షిత సమాజ నిర్మాణం…
24 గంటలు డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం…
రేణిగుంట సెప్టెంబర్ 24:
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ త్రిశూల్’ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ తెలిపారు. మాదకద్రవ్యాల నిరోధం, మహిళలు-బాలికల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కరకంబాడి తారక రామ నగర్లో నిర్వహించిన ప్రజా వేదికలో ఎస్పీ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో తారక రామ నగర్లోని టిడిపి సీనియర్ నాయకుడు బుచ్చినాయుడుతో పాటు స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలోని పునరావాస గ్రామంలో ఎస్పీ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర, ఎస్ఐ శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత, సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా, నేర సమాచారం ఉన్నా వెంటనే 24 గంటలు అందుబాటులో ఉండే డయల్-112 ను సంప్రదించాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.


