ఎస్పీ కార్యాలయంలో దళిత, ప్రజా సంఘాల వినతి…
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను కించపరిచే విధంగా పుస్తకం రాసిన 'హమారా ప్రసాద్' (నాగులారపు వరప్రసాద్) పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 'గ్రీవెన్స్ డే' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దళిత సింహం, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తాళ్ళపాక దాము, జై భీమ్ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవర్ రామచంద్రన్ మాట్లాడుతూ… డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతి నిర్మాణానికి చేసిన సేవలను అవమానించేలా "కల్పిత నాయకుడు" పేరుతో హమారా ప్రసాద్ వివాదాస్పద పుస్తకం రాయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయులపై విద్వేషాన్ని వ్యాప్తి చేయడం భావప్రకటన స్వేచ్ఛ కాదని, అది ముమ్మాటికీ చట్టరీత్యా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.
సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించిన సదరు వ్యక్తిపై ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి పుస్తక ప్రతులను స్వాధీనం చేసుకున్నారని, అతనికి న్యాయస్థానం ద్వారా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రాజ్యాంగ నిర్మాతలపై ఎవరూ ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు రెవరెండ్ సతీష్ విజయ్ కుమార్, ఎస్సీ/ఎస్టీ నాయకుడు జయరామ్, ఉదయ్ తాళ్ళపాక, కురకల్వ హేమంత్,మల్లరపు కిశోర్ కుమార్ పలువురు దళిత, బహుజన నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

