
మన ధ్యాస ,నిజాంసాగర్: ( జుక్కల్ ) సెప్టెంబర్ 15 ,రైతుల సంక్షేమం, అభివృద్ధికి సొసైటీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అచ్చంపేట పీఏసీఎస్ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట రైతు వేదికలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో మహాగర్జన సభను చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.సమావేశంలో సొసైటీ కార్యకలాపాలు, రైతులకు అందుతున్న సేవలు, భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సొసైటీ ద్వారా రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని చైర్మన్ తెలిపారు. రైతులు సొసైటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.2026 మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు సొసైటీకి సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాలను సీఈవో సంగమేశ్వర్ గౌడ్ సభలో చదివి వినిపించారు. సొసైటీ ఆర్థిక లావాదేవీలు, జమలు, ఖర్చులకు సంబంధించిన వివరాలను సభ్యులకు వివరించారు.సొసైటీ కార్యకలాపాల్లో పారదర్శకత పాటిస్తూ సభ్యులకు పూర్తి సమాచారం అందించాలని సమావేశంలో చర్చించారు. రైతులకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంకు లక్ష్మయ్య, మండల వ్యవసాయ అధికారి ఆచరిత, ఏఈఓ స్వర్ణలత, సొసైటీ వైస్ చైర్మన్ గుమస్తా శ్రీనివాస్, సీఈఓ సంగమేశ్వర్ గౌడ్, సొసైటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.