
మన ధ్యాస,నిజాంసాగర్, (బిచ్కుంద, ) సెప్టెంబర్ 15: అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుందలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కర్ చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 16,564 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన నిలుస్తుందని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన నిరుపేద కుటుంబాల కలను సాకారం చేస్తూ కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందన్నారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు రేషన్ కార్డు పొందని వారు ఉంటే వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి,మున్సిపల్ కమిషనర్ ఖయ్యూం టీపీసీసీ డెలిగేట్ విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగనాథ్, తహసీల్దార్ వేణుగోపాల్, కౌన్సిలర్లు సందాని, ముజాహిద్, శ్యామల, కార్తిక, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.