
మన ధ్యాస,నిజాంసాగర్ ,/( జుక్కల్ ) సెప్టెంబర్ 12: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ అన్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్, గున్కుల్ గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.బూర్గుల్, గున్కుల్ గ్రామాల్లోని 238, 241 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. మహమ్మద్‌నగర్ తహసీల్దార్ లతతో కలిసి ఎస్ఐఆర్ పనుల పురోగతిని సమీక్షించారు. గున్కుల్ గ్రామంలో ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులు, వారు సమర్పించిన సంబంధిత పత్రాలను పరిశీలించి, వివరాల నమోదు, పత్రాల పరిశీలన జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ…ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ, సంబంధిత పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వివరాల నమోదు లేదా పత్రాల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పేర్లను గుర్తించి, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఓటర్లు సమర్పించాల్సిన పత్రాలు, దరఖాస్తులపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
అనంతరం బూర్గుల్ గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్‌ను అదనపు కలెక్టర్ సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది అందుబాటు, ప్రజలకు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్‌నగర్ తహసీల్దార్ లత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగి రమేష్ యాదవ్, గున్కుల్ సర్పంచ్ గజ్జల జీవన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజయ్య, అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.