
మన ధ్యాస,మక్తల్: టౌన్‌లోని రాయల్ ఫంక్షన్ హాల్లో మక్తల్, ఉట్కూర్, మాగనూర్, కృష్ణ మండలాల పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై గణేష్ ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మక్తల్ సీఐ రామ్ లాల్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ, విద్యుత్ వైర్ల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు.డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గణేష్ మండపం వద్ద ఇద్దరు నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో మక్తల్ ఎస్ఐ రాజు, మాగనూర్ ఎస్ఐ అశోక్ బాబు, కృష్ణ ఎస్ఐ ఎస్.ఎం. నవీద్, రమేష్, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
