రేణిగుంట: విద్యార్థులలో సైన్సు పట్ల ఆసక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రేణిగుంట మండల స్థాయి 'చెకుముకి సంబరాలు - 2026' ఘనంగా నిర్వహించారు. స్థానిక రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ప్లస్)లో నిర్వహించిన ఈ చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో మండల వ్యాప్తంగా 9 ప్రభుత్వ పాఠశాలలు, 7 ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో గుత్తివారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బృందం, ప్రైవేట్ పాఠశాలల విభాగంలో అమరరాజ స్కూల్ బృందం ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌కు ఎంపికయ్యారు. అనంతరం పాఠశాల స్థాయి మరియు మండల స్థాయి విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు అల్లాబక్షు, కార్యదర్శి కుప్పుస్వామి మాట్లాడారు. విద్యార్థులలో విజ్ఞాన తృష్ణను పెంచడానికి, ప్రశ్నించే తత్వాన్ని, అందరికీ సైన్స్ జ్ఞానాన్ని అందించడానికే ప్రతి ఏటా ఈ చెకుముకి సంబరాలను జరుపుతున్నామని వారు తెలిపారు. పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి జబ్బార్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, ఇటువంటి సైన్స్ సంబరాల్లో పాల్గొని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కాగా, ఇటీవల మెడికల్ సీటు సాధించిన ప్రతిభావంతురాలు ఝాన్సీ ఈ పోటీల పేపర్ కరెక్షన్ నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మోహన్, జయమ్మ, వాసుదేవయ్య, సుభాషిణిలతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, జెవివి ప్రతినిధులు పాల్గొన్నారు.

