తిరుపతి సెప్టెంబర్
టీటీడీలో విధులు నిర్వహిస్తున్న సిపిస్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఒపీస్ పెన్షనర్లతో సమానంగా ఎంప్లాయిస్ హెల్త్ ఫండ్ ( ఈ హెచ్ ఎఫ్ ) ద్వారా క్యాష్ లేస్ వైద్య సదుపాయం కల్పించేందుకు టీటీడీ యాజమాన్యం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వాగతించింది.
“ఉద్యోగుల సంక్షేమం కోసం తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి సిపిస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం ఈ హెచ్ ఎఫ్ వైద్య సదుపాయం కల్పించడం ఎంతో సంతోషకరం. ఈ నిర్ణయం ఉద్యోగులు, వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తుంది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ యాజమాన్యానికి ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సిపిస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 3,000 మంది సిపిస్ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు రిటైర్మెంట్ అనంతరం వైద్య భద్రత లభించనుందని, ఇది ఉద్యోగులకు ఎంతో పెద్ద ఉపశమనమని చీర్ల కిరణ్ పేర్కొన్నారు.
అలాగే శ్రీవారి పోటులో లడ్డూల తయారీని వేగవంతం చేసేందుకు 400 అదనపు అవుట్సోర్సింగ్ వర్కర్ పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపడం, టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగులకు వేతనాలు పెంచేందుకు నిర్ణయం, తిరుమలలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందికి రవాణా ఛార్జీలుగా 3 సంవత్సరాలకు ₹1.60 కోట్లు మంజూరు చేయడం, గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల ఎఫ్ ఎం ఎస్ కార్మికులకు లడ్డూ, వడ అందించేందుకు నిర్ణయం తీసుకోవడం వంటి ఉద్యోగ సంక్షేమ చర్యలను కూడా అసోసియేషన్ అభినందించింది. అదేవిధంగా మే–జూలై 2026 కాలంలో ఈహెచ్ఎఫ్ పథకం కింద ₹5 లక్షలకు మించిన వైద్య ఖర్చులు చేసిన 15 మంది ఉద్యోగులు/పెన్షనర్లకు మొత్తం ₹54.66 లక్షల రీయింబర్స్మెంట్ మంజూరుకు ఆమోదం తెలపడం, అలాగే టీటీడీలో విధులు నిర్వహిస్తున్న వందలాది మంది ఉద్యోగులకు టైమ్ స్కేల్ ప్రకటించి ఉద్యోగ భద్రత కల్పించే చర్యలను అసోసియేషన్ హర్షించింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు , టీటీడీ బోర్డు సభ్యులు, ఈఓ ముద్దాడ రవిచంద్ర , అదనపు ఈఓ వెంకయ్య చౌదరి , జేఈఓలు శరత్ , పి. గోపీనాథ్ (జె & హెచ్) మరియు ఇతర అధికారులకు ఉద్యోగుల తరపున చీర్ల కిరణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్, కోశాధికారి గుంటూరు రేఖ, సభ్యులు గంటా భరత్, కొప్పర్తి శివ, హరి చౌదరి, మణికంఠ, రమాదేవి, ఈశ్వర్ నాయక్, సునీల్ కుమార్ యాదవ్ మరియు కార్యవర్గ సభ్యులు కూడా టీటీడీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
