శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ గోవింద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రతి సంవత్సరం భక్తుల కోసం నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి ని సమితి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.తిరుమల కొండకు కాలినడకన వెళ్లే వేలాది మంది భక్తుల ఆకలి తీర్చే లక్ష్యంతో శ్రీ గోవింద సేవా సమితి ఎన్నో ఏళ్లుగా నిరంతరాయంగా ఈ సేవలను అందిస్తోంది.ఈ ఏడాది జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా శ్రీవారి మెట్టు మార్గంలో విస్తృత స్థాయిలో అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్ఛం అందించి, బ్రహ్మోత్సవాల అన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి తమ చేతుల మీదుగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయాలని కోరారు.సమితి సభ్యుల ఆహ్వానానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ, కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ గోవింద సేవా సమితి ముఖ్య నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు.

