
తవణంపల్లి, ఆగస్టు 17 మన జైత్రయాత్ర (అనంత కుమార్ )
తవణంపల్లి మండల కేంద్రంలోని తవణంపల్లి ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే (ఏ పి యూ డబల్యు జె ) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా ఈసీ మెంబర్, తవణంపల్లి అధ్యక్షులు జగన్నాథం, ఉపాధ్యక్షులు సిద్దయ్య, సెక్రటరీ అనంత కుమార్, సభ్యులు బొజ్జయ్య, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ నాయకులు, సభ్యులు కలిసి కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు జగన్నాథం, సెక్రటరీ అనంత కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ప్రజలకు వాస్తవాలను చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షిస్తూ జర్నలిజం ప్రమాణాలు, విలువలను కాపాడేందుకు యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.70 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో జర్నలిస్టుల హక్కులు, పత్రికా స్వేచ్ఛ, వృత్తిపరమైన గౌరవం కోసం ఏపీయూడబ్ల్యూజే చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేసి, వారి సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఒకరికొకరు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో తవణంపల్లి ప్రెస్ క్లబ్‌కు చెందిన జర్నలిస్టులు, ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.