తిరుపతి (న్యూస్) ఆగష్టు 13.
ఈ నెల 24 నుండి 27 వరకు తిరుపతిలో నిర్వహించనున్న ‘అమరావతి ఛాంపియన్షిప్ - 2026’ రాష్ట్ర స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను పటిష్టంగా, సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడాకారిణి రజినిలతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన సుమారు 14,700 మంది క్రీడాకారులు, 1,000 మంది కోచ్లు, అధికారులు తిరుపతికి రానున్నారని తెలిపారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎస్వీయూ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, టీటీడీ విద్యాసంస్థలతో పాటు అవసరమైన చోట ప్రైవేట్ విద్యాసంస్థల హాస్టళ్లలో వసతి కల్పించాలని ఆదేశించారు.
ఆగస్టు 24న తారకరామ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని, క్రీడాకారుల రవాణా, నాణ్యమైన భోజనం, పారిశుధ్యం, వైద్యం మరియు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి పోటీలను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ శారదా దేవి, డిఎస్డిఓ శశిధర్, డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

