గాజులమండ్యం (రేణిగుంట):ఆగష్టు 13.
రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజులమండ్యం ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ( ఆర్ బి ఎస్ కే ) ద్వారా నిర్వహించే ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ ప్రయోజనాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ సూపర్వైజర్ కామరాజు తమ ఆరోగ్య సిబ్బందితో కలిసి విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కామరాజు మాట్లాడుతూ, పాఠశాల వయస్సు పిల్లల్లో తలెత్తే వివిధ ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో తగిన వైద్య సేవలు అందించడమే ఆర్బీఎస్కే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రత్యేకంగా '4Ds' అనే విధానం ద్వారా పుట్టుకతో వచ్చే లోపాలు (డిఫెక్ట్స్ అట్ బర్త్ ), పోషకాహార లోపాలు (డెఫిషన్సీస్ ), చిన్ననాటి వ్యాధులు (చిల్డహుడ్ డీజీసెస్ ), అలాగే శారీరక, మానసిక వికాసంలో ఆలస్యం మరియు వైకల్యాలు (డెవలప్మెంటల్ డిలేస్ ఇంక్లూడింగ్ దిశబిలిటీస్ ) వంటి సమస్యలను గుర్తించి తదుపరి ఉచిత వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు రెఫర్ చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలలో నిర్వహించే ఆరోగ్య స్క్రీనింగ్‌కు విద్యార్థులందరూ స్వచ్ఛందంగా సహకరించాలని, ఎలాంటి శారీరక అసౌకర్యాలు ఉన్నా సంకోచించకుండా సిబ్బందికి వివరించాలని కోరారు.
అలాగే విద్యార్థుల నిత్య జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు ఎంతటి ప్రాధాన్యమైనవో వివరిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల్య పోషకాహారం, సరియైన సమయానికి నిద్ర, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం మరియు భోజనానికి ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం లాంటి సూత్రాలను పాటించాలని ఆయన హితవు పలికారు. ఆరోగ్య సమస్యలను సకాలంలో నయం చేసుకోవడం వల్ల చదువుపై శ్రద్ధ పెరిగి, పిల్లల భవిష్యత్తు మెరుగవుతుందని పేర్కొంటూ “ఆరోగ్యమైన బాల్యం – ఆరోగ్యమైన భవిష్యత్తు” అనే ఆశాజనక సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వేణుగోపాల్, ఎఎన్ఎమ్ సుభాషిణి, ఎమ్ఎల్హెచ్పీ తేజ, హెల్త్ అసిస్టెంట్ మునివెంకటప్ప, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు చాముండేశ్వరి, శిరీష, సరస్వతి, రేచల్, సరోజిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
