
బంగారుపాళ్యం ఆగస్ట్ 11 మన ద్యాస (నాగరాజ సరకింటి)
బంగారుపాళ్యం మండలంలోని ఎస్సీ కాలనీ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న శ్మశానవాటిక సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. సుమారు 70 ఏళ్లుగా శ్మశానవాటికకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రజల సమస్యపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే స్వయంగా ఎస్సీ కాలనీలో పర్యటించి, అక్కడి ప్రజలతో మాట్లాడి శ్మశానవాటిక సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో చర్చించి, ఎస్సీ కాలనీ ప్రజలకు శ్మశానవాటిక కోసం అవసరమైన స్థలాన్ని మంజూరు చేయించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.శ్మశానవాటిక స్థలం మంజూరు కావడంతో ఎస్సీ కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను స్వయంగా పరిశీలించి, అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించిన ఎమ్మెల్యేకు, సహకరించిన జిల్లా యంత్రాంగానికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.70 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించడంతో ఇకపై తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాలనీ ప్రజలు పేర్కొన్నారు.